కథలు
🔔 *గురు బోధ* 🔔
"కర్మ కర్మణా నశ్యతి"
గంగలో
స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది... వెంటనే గంగానదినే అడిగాడట.
"అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ..." అని.
అందుకా తల్లి "నాయనా! నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.
వెంటనే, అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతేకదా... పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని... సముద్రాన్నే అడిగాడు...ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని... దానికా సముద్రుడు బదులు ఇస్తూ...
"నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను" అని అన్నాడు.
అరే ... ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది... అని అనుకుంటూ, "ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు... ఈ పాప భారాన్ని?" అని అడగగా... అవి పకపకా నవ్వి 'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా...
ఓహో...ఆ పాపాలన్నీ మన మీద పడి లేదా తాగుతూ, మనమే అనుభవిస్తున్నామన్నమాట.
కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట.
"ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః
ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే"
పరమశివుడు, పార్వతీదేవి కి ఉపదేశించిన శ్లోకమిది.
ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు.
ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?...అని ఈ శ్లోకం అర్థం.
"కర్మ కర్మణా నశ్యతి.... " ... అనగా, అజ్ఞాన కర్మ జ్ఞాన మిళితమైన కర్మతోనే నశిస్తుంది.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
------------------------------------------------------------
🔔 *సత్సంగం* 🔔
వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ‘ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి!’ అన్నాడు.
కాసేపు ఆలోచించి…“స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి,” అన్నాను.
ఆశ్చర్యంగా అతను నా వంకచూసి “అదెలా?” అన్నాడు.
నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను.. “జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..
కానీ, ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు అవసరంలేదు!
దేవుడిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..
డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..
సత్సంగత్వే నిస్సంగత్వం !
నిస్సంగత్వే నిర్మోహత్వం !!
నిర్మోహత్వే నిశ్చలతత్వం !
నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!
సత్పురుషులు .. మార్గదర్శనం
సత్సంగత్యం .. సహవాసం
సత్ప్రవర్తన .. జీవించడం
మించి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి, మరొకటి లేదు ..
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🔔 *సత్సంగం* 🔔
*సత్సంగం పరమార్థం...*
సత్ సంగం అంటే మంచి కలయిక.
సత్ సాంగత్యమే సత్సంగం పరమాశయం.
చెడు శక్తులు వాటంతట అవే మనల్ని ఆవరిస్తాయి.
కాని మనం ప్రయత్నిస్తేగాని సత్పురుషులను కలుసుకోలేము. సత్సంగం ఫలితాల గురించి
శ్రీఆదిశంకరాచార్యుల వారు చక్కగా, సూటిగా చెప్పారు.
*సత్సంగత్వే నిస్సంగత్వం*
*నిస్సంగత్వే నిర్మోహత్వం*
*నిర్మోహత్వే నిశ్చలతత్వం*
*నిశ్చలతత్వే జీవన్ముక్తిః*
సజ్జనులతో సాంగత్యం వల్లనే క్రమ పరిణామంలో జీవన్ముక్తి లభిస్తుంది. సత్సంగం మొదట నిస్సంగత్వాన్ని కలిగిస్తుంది. అంటే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా లోకంలోని చెడుకు దూరం అవుతాము. దీనివల్ల మనసు మోహ వికారాలకు లొంగిపోదు. ఈ నిర్మోహత్వం వల్ల బుద్ధి నిశ్చలం అవుతుంది. ఈ నిశ్చలత్వం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది.
ముక్తి అంటే సాంసారిక బంధాల నుండి విడుదల. శ్రీ శంకర భగవత్పాదుల వారి దృష్టిలో ఆత్మ సాక్షాత్కారం పొందడమే మోక్షం. అదే జీవన్ముక్తి.
కాబట్టి ఏదైనా ఒక సత్సంగంలో చేరాలి. లేదా మనమే ప్రారంభించాలి. మంచి విషయాలు మాట్లాడుకోవాలి. వాటిలో కొన్నైనా ఆచరణలో పెట్టాలి.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
------------------------------------------------------------
🔔 *అనగనగా...* 🔔
*కోతులను పట్టుకునేవాళ్లు.. ఇరుకు మెడ ఉండే బరువైన కూజాలో వేరుశనగ పప్పులను వేసి చెట్టుకింద పెడతారు.*
*అటువైపు వచ్చిన కోతి.. ఆ కూజాలోకి చేతిని పోనిచ్చి గుప్పెట నిండా గింజలను పట్టుకొని బయటకు* *తీయడానికి ప్రయత్నిస్తుంది.*
*మూతి ఇరుగ్గా ఉండడంతో.. పిడికిలి బయటకు రాదు. చేతిలో ఉన్న వేరుశనగ పప్పులను వదిలేస్తే చెయ్యి* *సులభంగానే బయటకొచ్చేస్తుంది.*
*కానీ, ఆశ.. ఆ గింజలను వదలనీయదు. కూజాతో సహా అక్కడి నుంచి పారిపోదామా అంటే.. అది బరువుగా ఉంటుంది.*
*దీంతో, కోతి అక్కడే ఉంటుంది.*
*కోతులు పట్టేవారు అక్కడికి వచ్చి దాన్ని బంధిస్తారు.*
*పట్టు విడవడం తెలియక కోతి బందీ అయినట్లుగా..
ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గించుకుని క్రమేణా* *విడిచిపెట్టడం తెలియక ఆధ్యాత్మిక చింతనాసక్తులు దారితప్పుతుంటారు.*
*పట్టుకోకూడనిదాన్ని తెలివితక్కువగా పట్టుకోవడం..
తీరా పట్టుకున్నాక దానివల్ల కలిగే ముప్పు గురించి తెలిసినా,
దాన్ని విడిచే ఆలోచన చేయకపోవడం.. ఫలితంగా కడగండ్లకు గురికావడం.. ఇదీ జరుగుతున్నది.*
*తనది కాని స్ర్తీని పొందాలనుకొని పట్టుపట్టిన రావణాసురుడు.. ఆమెను విడిచిపెట్టాలంటూ తన* *శ్రేయోభిలాషులు చెప్పిన మాటలను విని ఉంటే కొడుకులను, సోదరుడు కుంభకర్ణుడిని, బంధువులను,* *పరివారాన్ని, రాజ్యాన్ని, చివరకు ప్రాణాల్ని పోగొట్టుకుని ఉండేవాడు కాదు.*
*అలాగే భారతంలో పాండవులకు ‘సూదిమొన మోపినంత భూమి కూడా* *ఇవ్వనంటూ పట్టిన పట్టు విడువక అహంకరించిన దుర్యోధనుడికి చివరికి ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే.*
*దురదృష్టం ఏమిటంటే బాహ్య విషయాలపై పట్టు గురించి ఆలోచిస్తామేగానీ.. మన అంతర్గత, ఆధ్యాత్మిక విషయాల పట్ల ‘పట్టు’ సాధించటానికి ప్రయత్నించం.*
*మనసు, జిహ్వ,* *ఇంద్రియాలపైన పట్టులేకపోవటం చేతనే* *భగవంతుడు మెచ్చే కార్యాలు చేయలేకున్నాం.*
*ఆయన అనుగ్రహానికి పాత్రులం కాలేకపోతున్నాం.*
*మనం ‘పట్టు’ వదల వలసింది.. లౌకిక విషయాల్లో!
పట్టు బిగించవలసింది..*
*ఆధ్యాత్మిక సాధనాంశాల్లో!!*
*అప్పుడే మనం భగవంతునితో అనుబంధాన్ని పెంచుకోగలం.*
*ఉదయం ఆకాశం ఎరుపు రంగుకు తిరిగితే చాలు ఇక సూర్యుడు వచ్చినట్లే.*
*చెట్టుకు పూలు పూస్తే చాలు, ఇక ఫలాలు వచ్చినట్లే.*
*అలాగే నీ అంతఃకరణంలో దైవీసంపద కూడుకుంటే చాలు ఆత్మజ్ఞానం - తద్వారా పరమాత్మ నీలో ప్రవేశించినట్లే. కనుక ఈ అధ్యాయంలోని విశేషాలను చక్కగా గ్రహించి ఆసురీ సంపదను దూరంగాత్రోసివేసి దైవీసంపదను ఆహ్వానిద్దాం, వృద్ధి చేసుకుందాం.*
*వేదాంతంలో జీవుణ్ణి పక్షితో పోలుస్తారు.
పక్షికి ముఖం సన్నగా ఉండి రెండు కళ్ళూ ముఖానికి అటూ ఇటూ ఉండి వేరు వేరు దృశ్యాలను చూపిస్తాయి. కాని* *మానవుడిలో ఆధ్యాత్మికమో - ప్రాపంచికమో ఏదో ఒక్క దృష్టే ప్రబలంగా ఉంటుంది.*
*ఆధ్యాత్మిక దృష్టి ఉన్నవాడు ఇంద్రియాలను, మనస్సును స్వాధీనంలో ఉంచుకొని తనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక దృష్టి ప్రబలంగా ఉన్నవాడు ప్రపంచంలోనే* *కూరుకుపోతాడు. అతడు* *తనలోని వాసనలను గురించి పట్టించుకోడు. దాని కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ - మరణిస్తూ ఈ సంసార జనన మరణ చక్రంలో కూరుకుపోతాడు.
ఆధ్యాత్మిక దృష్టి గలవాడు తనలోని వాసనల గురించి విశ్లేషించి, అవి ఆసురీసంపద అయితే* *త్రోసివేసి, దైవీసంపదను వృద్ధి చేసుకుంటాడు. పరమాత్మకు దగ్గరవుతాడు.*
*మన మూర్ఖత్వప్రవర్తనతో*
*జీవించి ఉండగా* *మరణించడమా! లేక విజ్ఞానం మరియు దైవ జ్ఞానం తో మరణించిన తరువాత కూడా జీవించివుండటమా!*
*ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి.*
------------------------------------------------------------
జీవితం పరమార్థం
🔔 *అనగనగా...* 🔔
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజున తన పని చేసుకుంటూ ఉండగా కనుచూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయం గా కనిపించింది..
దానికి మురిసి అతను ఆ రాయిని గుడ్డలో కట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి రాయి దొరక్క దాన్ని ఉపయోగించుకుంది.... తరువాత ఆ రాయిని అదే పనికి చాలా సార్లు వాడుకున్నది. ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు..
కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరు ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాళ్ళు చేతిలో పట్టుకుని వెళ్ళాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక చిక్కీ (పల్లీ పట్టీ) ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక చిక్కీ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు.. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు. అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి ఇవ్వవా అని అడిగాడు. దానికి అతను కొంత రొక్కము తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు..
బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి కొంత రొక్కం ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.
నీతి --- అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకోడానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక చిక్కీ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు... అట్లాగే ....
ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేని కోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి ప్రచోదనానికి లోబడి ఉంటుంది. మానవ జీవిత పరమార్థం తెలుసుకొనిన వారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొందగలుగుతున్నారు... లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొనుచున్నారు..
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
Comments
Post a Comment